అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
ఫిబ్రవరి 21
నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.
ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగం ‘యునెస్కో’ 1999లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. నాటి పాకిస్థాన్లో బెంగాలీలు 1952లో తమ మాతృభాష బెంగాలీ పరిరక్షణకోసం చేసిన పోరాటానికి గుర్తుగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ తేదీ ఖరారైంది.
యునెస్కో వారు విద్యాబోధనలో కనీసం మూడు భాషలు – మాతృభాష, ప్రాంతీయ/జాతీయభాష, ఒక అంతర్జాతీయ భాషకు చోటుండాలని 1999 నుండి ప్రచారం చేస్తోంది. పిల్లలు పసిప్రాయంలో మాతృభాష ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టి, తరువాత మరో భాష నేర్చుకుంటే వారి విద్యా జీవితం ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనలు చిన్నపిల్లల మానసిక ఆరోగ్యానికి – వారి మాతృభాషతో ఉండే అనుబంధానికి సంబంధం ఉందని స్పష్టం చేస్తున్నాయి.

(Image from UN offical)
గర్భస్థ శిశువులు ఉమ్మనీటిలో ఉన్నప్పుడు సాధారణంగా మాతృభాష ధ్వనులు వింటారు. అవి వారిపై ప్రభావం చూపుతాయి. ఆ తరువాత వారు భూమిపై ఎదిగే సమయంలో అవి వారి మానసిక ఎదుగుదలపైన, వ్యక్తిత్వ రూపకల్పనపైనా ప్రభావం చూపుతాయి. మాతృభాషలో మాట్లాడలేని పిల్లల్లో చురుకుదనం పాళ్ళు తక్కువగా ఉంటాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇతర భాషలు మాట్లాడే సమయంలో మెదడు-నాలుక మధ్య మాత్రమే సంబంధం ఉండగా, మాతృభాష మాట్లాడేటప్పుడు మనస్సు-మెదడు-నాలుక మధ్య సంబంధం ఉంటుంది. ఈ మూడింటి సమన్వయమే వారి ఎదుగుదలకు కీలకమవుతుందట.

అమ్మపాలు-అమ్మభాషలకు ఈ ప్రపంచంలో మరేవీ సాటిరావు. అందుకే మన పిల్లలకు తల్లిభాష నేర్పుదాం, వారి నిజమైన అభివృద్ధికి బాటలు వేద్దాం!
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు