నేటి పంచాంగం, నేటి విశిష్ఠత– హనుమద్వ్రతం
ది. 𝟏𝟑-𝟏𝟐-𝟐𝟎𝟐𝟒 – నేటి పంచాంగం
డిసెంబరు 13, శుక్రవారం 2024
హనుమద్వ్రతం
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
మార్గశిర మాసం
శుక్ల పక్షం
తిథి: త్రయోదశి సా6.17
వారం: భృగువాసరే (శుక్రవారం)
నక్షత్రం: భరణి ఉ6.49 & మర్నాడు కృత్తిక తె5.28
వర్జ్యం: సా6.08-7.39
దుర్ముహూర్తము: ఉ8.36-9.20 & మ12.16-1.00
అమృతకాలం: తె3.12-4.42
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండం: మ3.00-4.30
సూర్యరాశి: వృశ్చికం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం: 6.25
సూర్యాస్తమయం: 5.24
🙏లోకాః సమస్తాః🙏
💐సుఖినోభవంతు💐
ఈరోజు రాశి ఫలాలు
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903.png)
మేషం రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-3-edited-1.png)
ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.
వృషభ రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-4-edited-1.png)
కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్య పరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మిథున రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-5-edited-1.png)
బంధు మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి వ్యాపారాలలో పార్టీ సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
కర్కాటకం రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-6-edited-1.png)
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. పరిస్థితి వంట నిరుత్సాహపరుస్తుంది. ఇంటాబయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి.
సింహం రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-7-edited-1.png)
దూరపు బంధువుల ఆగమనం ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులతో పాత విషయాల గూర్చి చర్చలు చేస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.
కన్య రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-8-edited-1.png)
నూతన పరిచయాలు విస్తృతం అవుతాయి. వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
తుల రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-9-edited-1.png)
కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. ఋణ ఒత్తిడి అధికమవుతుంది. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగము అధికారులతో చర్చలు ఫలించవు.
వృశ్చికం రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-10-edited-1.png)
అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి. దూరప్రాంత మిత్రుల నుండి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.
ధనుస్సు రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-11-edited-1.png)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
మకరం రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/Screenshot-2024-12-11-071627.png)
శ్రమ ఫలిస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
కుంభం రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-13-edited-1.png)
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.
మీన రాశి
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/eipng9W60903-14-edited-1.png)
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
🚩నేటి విశిష్ఠత – హనుమద్వ్రతం🚩
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-13-at-7.39.34-AM.jpeg)
13-12-24 మార్గశిర శుద్ధ త్రయోదశి, శుక్రవారం.ఈ రోజు ప్రతి ఒక్కరూ శ్రీహనుమదారాధన, శ్రీ హనుమద్ వ్రతం ఆచరించాలని చెప్పి పరాశర సంహిత తెలియజేస్తోంది.ఒక్క హనుమంతుడిని ఆరాధిస్తే సకల దేవతలను ఏకకాలంలో ఆరాధించిన ఫలితం కలుగుతుందని పురాణ వచనం.
మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా మహావీరేణ ధీమతా ||
ఓం నమో భగవతే వాయునందనాయ.
![](https://vignanakoumudi.com/wp-content/uploads/2024/12/WhatsApp-Image-2024-12-13-at-7.39.35-AM.jpeg)
వ్రత విధానము:
ఈ వ్రతమునకు ముఖ్యమయిన రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి. క్రిందటి దినమునుండే వ్రతయత్నములు గావించుకొనుచు శుచియై గడిపి బ్రాహ్మీ ముహూర్తముననే లేచి గురుధ్యానముతోబాటు యధోచిత కృత్యము లొనర్చి వ్రతమునకు సంకల్పింపవలెను.
హనుమంతుడు పంపాతీరమున విహరించుడు కాన ఈ వ్రతమును పంపాతీరముననే కావింపవలెను. అది యందులకు అసాధ్యము కాన పంపాతీరమునకు బదులు పంపాకలశము నేర్పాటుచేసి దాని నారాధించి దాని ప్రక్కనే హనుమద్ర్వతమాచరించినచో హనుమంతుడు పంపాతీరమున వ్రత మాచరించునట్లు సంతసించి యనుగ్రహించును.
వ్రతారంభమునకు ముందుగానే అవసరద్రవ్యములను సమకూర్చుకొనవలెను. పీఠము, పట్టువస్త్రములు, వలయు కలశములు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు షోడశోపచార ద్రవ్యములు, హనుమత్ప్రతిమ, లేదా యంత్రం, పదమూడు ముళ్లుగల తోరము వంటివాని నన్నింటిని సిద్ధము చేసికొని, బంధుమిత్రాదులందరనాహ్వానించి శుచియై వ్రతమునకు సంకల్పింపవలెను.
శ్రీ హనుమద్ర్వత కధలు ప్రధమ అధ్యాయము:
పూర్వము శౌనకాది మహామునులు గంగాతీరమందు ఉన్నవారై జగన్నాథుడు, లక్ష్మీపతి యైన విష్ణువునకు నమస్కరించి పరమ భాగతోత్తముడు, పురాణప్రవచన మొనర్చువాడు అగు సూతుని చూచి అందరు నమస్కరించి వ్రతపరాయణులై ఇట్లు పల్కిరి. “ఓ సూతమహామునీ! విష్ణుగాథను వివరించుఛు నీవు మా కనేక వ్రతములను చెప్పితివి. అట్లే మా కిప్పుడు మరొక్క వ్రతమునుగూర్చి చెప్పవలసినది.”
మత్స్య పూజ యొక్క ప్రాముఖ్యత:
మత్స్య ద్వాదాశి నాడు ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి , స్నానం చేసి విష్ణు ఆలయాన్ని సందర్శిస్తారు. భక్తులు చందనం పేస్ట్ , ధూపం , పండ్లు , పువ్వులతో విష్ణువును పూజిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి విష్ణువు నుండి ఆశీర్వాదం పొందటానికి విష్ణు సహస్రనామ మరియు మత్స్య పురాణాలను చదువుతారు. త్రయోదశి రోజు సూర్యోదయం వరకు ఈ ఉపవాసం ఉంటుంది. విష్ణువును ఆరాధించిన తరువాత భక్తులు ఉపవాసం విరమించుకుంటారు. వివాహితులు తమ భర్త మరియు బిడ్డల వైవాహిక శ్రేయస్సు కోసం ఈ రోజును పాటిస్తారు. ఆరోగ్యం , సంపద మరియు శ్రేయస్సు కోసం పురుషులు మత్స్య ద్వాదశిని పాటిస్తారు. మత్స్య ద్వాదశి రోజున భక్తులు రాత్రి మేల్కొని వేద మంత్రాలు జపిస్తారు. విరాళాలు లేదా దాతృత్వం ఇవ్వడం చాలా ప్రయోజనకరం.
సూత ఉవాచ:
సూతమహాముని ఇట్లనిరి- “ఓ మునులారా! పరమపవిత్రమైనది, నాల్గు వర్ణములవారు అనుష్టింపదగినది, అతి రహస్యమైనది, లోకమందు గొప్ప మంగళప్రదమైనది, ఆయురారోగ్య భోగభాగ్యములను, పుత్రపౌత్రులను కల్గించునది, విద్యాప్రదమైనది యగు శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను వినుడు.
ఒకప్పుడు దయాపూర్ణుడగు వ్యాసభవానుడు తనశిష్యులతో కూడి ద్వైతవనమునకు ధర్మరాజును చూచుటకై హఠాత్తుగా వచ్చెను. ఆ ద్వైతవనము పంచమస్వరం కల కోకిలలతోను, షడ్జస్వరము పలుకు నెమళ్ళతోను మిక్కిలి కూడియున్నది. బాగుగ తెలిసి వేదములనధ్యయన మొనర్చెడి అనేకమంది వేదజ్ఞులతోను, వారి పుత్రపౌత్రగణములతోను కూడి మనోహరమైనది. శాస్త్రవ్యాఖ్యానములతోను, వేదఘోషతోను కూడియున్నది. మహాభాగవత గానముచే హరికథానిలయమైనది. నిత్యము అన్నదానము జరుగునట్టిది. ఆశ్రమము లన్నిటియందు శ్రేష్టమైనదియును. తమ్ములతోను భార్యతోను కూడియున్న ధర్మరాజు నట వ్యాసుడు చూచెను. ఆ ధర్మరాజుకూడ వ్యాసభగవానుడు వచ్చుచున్నాడని విన్నవెంటనే చాలాదూరము సోదరులతోపాటు ఎదురేగి తోడ్కొనివచ్చి ప్రశాంతమగు గృహమున కూర్చుండబెట్టి సేవ లొనర్చెను. ఆ వేదవ్యాసుడు ద్రౌపది చేసిన సేవలకు సంతసించి బృహస్పతి దేవేంద్రుని క్షేమవిచారము చేసినట్లు ధర్మరాజుయొక్క యోగక్షేమములడిగెను.
వేదవ్యాసమహాముని ఇట్లడిగెను. ఓ మహారాజా! ధర్మజా క్షేమముకదా! మహావీరుడైన భీముడు సుఖముగానున్నాడు కాదా! అర్జునుడు, నకుల సహదేవులును క్షేమముకదా! అర్జునుడు పాశుపత మహాస్త్రమును సంపాదించెనుకదా! అని యడిగి యనంతరము, ఓ ధర్మరాజా! సంప్రదాయబద్దమైన మిక్కిలి రహస్యమైన వ్రతమొక్కటి కలదు. చెప్పెదను వినుము. ఆ వ్రతము నాచరించినచో నీకు త్వరగా మరల నీ రాజ్యము లభించును. అనగా ధర్మరాజు ఇట్లడిగెను. ఓ మహామునీ! ఆ వ్రతము పేరేమి? ఆ వ్రతమాహాత్మ్య వైభవము లెట్టివి? ఆ వ్రతమునకు దేవత ఎవ్వరు? ఏ మాసమునందు దాని నాచరింపనగును? పూర్వ మెవ్వరావ్రత మాచరించిరి? చెప్పవలసినది. ఆ వ్రతము వెంటనే ఫలితమిచ్చునదైనచో ఇప్పుడే అచరింతును. ఓ మహానుభావా! సహోదరులతో కూడి దుఃఖితుడవైయున్న నా యందట్టి ఆదరము కల మీకంటె నాకు వేరు బంధువులు లేరు. అని ఈ రీతిగా ధర్మరాజు వ్యాసునియందు గౌరవముతో పల్కెను.
అంతట వ్యాసుడు హనుమంతుని మనస్సున పలుమార్లు స్మరించుచు ఇట్లు చెప్పదొడగెను. ఓ రాజశ్రేష్టా! అద్భుతమగు ఆ వ్రతము హనుమద్ర్వతము. దాని నుచ్చరించుటచేతనే నిస్సందేహముచేతనే నిస్సందేహముగా కార్యసిద్ధి యగును. ఆ వ్రతము దుష్టగ్రహములను పారద్రోలునది. మహాజ్వరములను కూడ పోగొట్టునది. పెక్కు మాటలేల? కోరిన కోర్కెలన్నిటి నిచ్చునదిగా తెలయబడుచున్నది. పూర్వము శ్రీకృష్ణభగవానుని ద్రౌవది ప్రార్థించుటవలన ఈ విశిష్టమగు హనుమద్ర్వతము నామెకు తెల్పెను. దాని ప్రభావముననే నీకు సర్వసంపదలు లభించినవి. ఒకప్పుడు ఆ ద్రౌపది కంఠమునందు ఉన్న హనుమద్ర్వత తోరమును చూచి అర్జునుడు ఏమిటి దీనిని ధరించితి వని యడిగెను. ద్రౌపది సుమధురము ఉత్తమము అయిన హనుమద్ర్వతమును గూర్చి తెల్పెను. ఆ మాట విని విధివశమున కోపపూర్ణుడై ఐశ్వర్య గర్వమున అర్జునుడు పౌరుషముగ నిట్లు పలికెను. నా జండా పై కట్టుబడి యుండువాడు, బ్రహ్మచారి, ఆకులు అలములు తిని బ్రతుకువాడు, మృగజాతివాడు, పరాధీనవర్తనుడు అయిన హనుమంతు డేమి ఈయగలడు? మీ స్త్రీజాతి బుద్ధి ఇంతియే. ఇటువంటి వ్రతములతో మమ్ముల మోసగించుచున్నావు.
అనగా నామె దుఃఖించి అర్జునునితో నిట్లనెను. ఓ రాజేంద్ర! ఈ వ్రతము జగన్నాథుడైన శ్రీ కృష్ణునిచేత నాకు చెప్పబడినది. ఆ మహనీయుడు వాసుదేవుడు చెప్పిన వ్రతము నాచరించి ఈ తోరమును ధరించితిని. అనగా అర్జునుడు కోపించి ఓ దుశ్శీలా! నీకు పరిహాసముగా ఈ వ్రతము చెప్పెనేగాని నిజముకాదు. ఆ దుష్టచిత్తుడగా కృష్ణుడు నాకు బద్ధుడై దాసునివలె నాయధీనుడుగా నున్న హనుమంతుని పూజ నీ కెందుకు చెప్పెను? భర్తృవాక్యమును వినని నీవు పతివ్రతవు కావు. అది నీకు వ్రతమైనను, వ్రతాంగమైనను ఆ తోరమును తీసివేయవలసినది. అని పల్కుటచే భయమందినదై పతియే దైవముగా కల పతివ్రతయగు ద్రౌపది వ్రతోద్యాపనకు ముందే ఆ తోరము నచ్చట వీడెను. అందువలననే ఓ ధర్మరాజా! మీ యొక్క సకలసంపదల వచ్చిన రీతినే పోయినవి. మీకిట్టి వనవాసక్షేశము సంభవించినది. పదమూడు ముడులుకల తోరమును త్యజించినందుకు ఫలముగా పదమూడేడు లిట్టి కష్టము లనుభవించవలసియున్నది. ఇది యంతయు విని ద్రౌపది ఆ వ్రతవిషయమును జ్ఞాపకము చేసుకొని భర్తలందరి యెదుట ఈ విషయము సత్యమని యప్పుడు చెప్పెను.
అంత వ్యాసుడు ఓ ధర్మరాజా! ఇంకను విననెంచినచో వేరొక గాథ చెప్పెదను. వినుము. పూర్వము శ్రీరాముడు లక్ష్మణునితో కూడినవాడై సీతను వెదకుచు ఋష్యమూకపర్వతము చేరి హనుమంతుని చూచెను. అంత రాముడు సుగ్రీవునితోను హనుమంతునితోను స్నేహము చేసెను. అట హనుమంతుడు రామునితో నిట్లనెను. ఓ శ్రీరామచంద్రా! నీభక్తుడ నైనట్టియు, రామకార్యమున ప్రవేశపెట్టబడనట్టియు నామాటను వినుము. పూర్వము దేవేంద్రుడు వజ్రాయుధముతో నా దవుడను కొట్టెను. ఆనాటినుండి భూతలమున హనుమంతుడనని పేరుగాంచితిని. అప్పుడు మూర్చనందిన నన్ను చూచి నా తండ్రియగు వాయుదేవుడు “ఏల నా కుమారుడు పడగొట్టబడినా” డని కోపమువహించి వాయువు వీచకుండ తిరోగమించెను. అ రీతిగా వాయువు లేక ప్రపంచము స్తంభించిపోవుటచే బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై ఈ రీతిగా పల్కిరి. ఓ ఆంజనేయ! నీవు చిరంజీవి వగుము. ఆంతులేని పరాక్రమము నంది రామకార్యము లన్నింటిని నెరవేర్చుము. ఓ వానరేశ్వరా! వాయుపుత్రా! హనుమద్ర్వమున నాయకుడవైన నిన్ను గొప్పగా ప్రతిష్ఠించి ఎవరు పూజింతురో వారి సర్వకార్యములు నెరవేరును. కార్యార్థయైన రాముడీ వ్రతమును ఆచరింపదగినదని కూడా చెప్పెను. ఆ వాక్యములను ఇప్పుడు గుర్తుతెచ్చుకొనినాను. ఓ రామా! నీవా మాటను తప్పక వినుము. వ్యర్థమగు అలోచన తగదు. దీనిని సత్యముగ నెంచును. నీకు మనసున నచ్చినచో కార్యసిద్ధికై ఆ వ్రతము నాచరింపుము. అని చెప్పి హనుమంతుడు మిన్నకుండగా ఇంతలో హఠాత్తుగా ఆకాశవాణి ‘ ఈ చెప్పిన విషయము సత్యమే’ అని పల్కెను. అట్టి ఆకాశవాణిని విని రాముడు సంతసించి అ వ్రత మాచరింపనెంచినవాడై హనుమంతునితో నిట్లు పల్కెను. ఓ హనుమంతా! ఏ రకమైన విధి ఆ వ్రతమునకు కలదు? దాని నెప్పు డాచరించవలెను? చెప్పు మనగా వాయునందను డిట్లు చెప్పదొడగెను.
మార్గశిరమాసమున శుక్లపక్షమున జయప్రదమగు త్రయోదశి యందు పదమూడ ముళ్ళుగల తోరమును పసుపురంగు దానిని కలశము నందుంచి పిదప నా కావాహన మొనర్చి పూజగావింపవలెను. పసుపుపచ్చని గంధము, పుష్పములు, అట్టివే ద్రవ్యములు విశేషించి ముఖ్యమయినవి. “ఓం నమో భగవతే వాయునందనాయ” అను మంత్రము నుచ్చరించుచునే పదమూడు ముళ్ళువేసి ఆ మంత్రముతోనే షోడశోపచార పూజ గావింపదగును. పిదప శ్రోత్రియు డగువానికి ఉపచారములొనర్చి ఉత్తమమగు వాయనమును పదమూడు అప్పములతో నీయవలెను. గోధుమాన్నమును సమర్పింపవలెను. దక్షిణతోకూడ తాంబూలము నర్పించుచు సదాచార సంపన్నులకు అన్నదాన మొనర్పవలెను. ఈ వ్రత ప్రారంభమందే కోరికలు నెరవేరును. దీనిని ప్రయత్నపూర్వకముగా పదమూడేడులు ఆచరింపనగును. దీని ఉద్యాపనము పదమూడు హనుమత్రృతిమలతో పూర్తియగును అని మిన్నకుండాను. రాముడు సుగ్రీవునితోను, సోదరునితోను కూడి ఆ వ్రతము నాచరించెను. దానిచే కార్యసిద్ధి చేకూరెను. సుగ్రీవుడును, విభీషణుడును రామోక్తమగు ఆ వ్రతమును యథోచితముగా ఆచరించి సత్పలితమందిరి. అప్పటినుండి లోకమునందు హనుమద్ర్వతము ప్రసిద్ధమైనది.
ఈ శుభప్రదమైన వ్రతము నాచరించుటవలన హనుమంతుని సహాయము చేకూరెను. కాన ఓ ధర్మరాజా! నీవుకూడ ఈ వ్రతము నాచరింపదగును. మాసములందు మార్గశిరమాసమును నేనే అని శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతలో చెప్పెను. కావున నీవుకూడ అట్టిమాసమున వ్రత మాచరించిన రాజ్యమును పొందగలవు. అను వ్యాసుని మాటలు విని అందరు సంతసించిరి. ఇంతలో సాయంసమయమై సూర్యుడస్తమించగా ఆ రాత్రి గడిపి ఉదయమే లేచి ధర్మరాజు వేదవ్యాసుని సమ్ముఖముననే సవిస్తరముగా హనుమద్ర్వతము నాచరించెను. ఆ రీతిగా ఈధర్మరాజు హనుమద్ర్వత ఉద్యాపన మాచరించి ఆజ్యసిక్తమైన పాయసముచేత హనుమ న్మూలమంత్రముతో హెూమము చేసి వ్రతమును సంపూర్ణమొనర్చెను. ధర్మపత్నియగు ద్రౌపదితో సాక్షాత్తుగా హనుమద్ర్వత మాచరించి సంవత్సరము గడువగనే రాజ్యమును పొందగల్లెను. కావున ఓ శౌనకాది మునులారా! వ్రతము లన్నిట శ్రేష్టమైన హనుమద్ర్వతమును మీరుకూడ చేయుడు. అట్లు ఆచరించిన మీరుకూడ సఫలమనోరథులౌదురు అని సూతుడు చెప్పెను. అట్లు వ్రత మాహాత్మ్య మెరిగిన మునులందరు యథావిధిగా మంగళప్రదమగు హనుమద్ర్వత మాచరించిరి.
ఇతి శ్రీహనుమద్ర్వత కథాయాం ప్రథమోధ్యాయః