మన ప్రజాస్వామ్య వ్యవస్థలో, మూడు స్తంభాలనదగిన వ్యవస్థలు… వీటిలో మొదటి స్తంభం- పార్లమెంటు, శాసనసభలు. వీటి ద్వారా చట్టాలను రూపొందించి పాలన విధానాలకు రూపం ఇస్తారు. రెండవ స్తంభం- విధానాలను అమలు చేయడానికి అవసరమైన కార్యనిర్వాహక వ్యవస్థ. దీని పని పార్లమెంటు, శాసనసభ చేసిన చట్టాలను అమలు చేయడం. దీనినే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటారు. మూడవ స్తంభం- న్యాయవ్యవస్థ. ప్రభుత్వాల చట్టాలు, నిర్ణయాలు, వాటి అమలు రాజ్యాంగ నిబంధనల పరిధిలో ఉన్నాయో లేదో, రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలకు లోబడి ఉన్నాయో లేదో సమీక్షించటానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ న్యాయవ్యవస్థ/జ్యుడిషియరీ. పైవాటితో పాటు నాలుగవ స్తంభమే.. “మీడియా”
తొలి భారత వార్తా పత్రిక ప్రారంభం– 26 జనవరి 1780
ప్రజాస్వామ్య మనుగడకు మీడియా/ పత్రికారంగం నాలుగో స్తంభం అంటారు. ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యంఎలా వర్థిల్లుతున్నదో తెలుసుకోవాలంటే అక్కడ ప్రతికా స్వేచ్ఛ ఎలా ఉందో తెలుసుకుంటే చాలు. పత్రికలు మన నిత్య జీవితంలో విడదీయ లేనంతగా పెనవేసుకుపోయాయి. సామాన్య ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అతి సామాన్య విషయాల నుండి దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే అత్యంత ప్రధాన విషయాల వరకు అన్ని రంగాలకు సంబంధించిన అంశాలను వార్తా పత్రికలు మనకంది స్తాయి. మొదట్లో వార్తా పత్రికలు కేవలం ప్రచురణ జరిగి వచ్చేవి. కాని నేడు ఎలక్ట్రానిక్ పద్ధతిలో తయారయ్యే ఇ-పత్రికలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
భారతదేశంలో తొలి పత్రిక హికీస్ బెంగాల్ గెజిట్’. దీనికే మరో పేరు ‘ది కలకత్తా జనరల్ ఎడ్వర్టైజర్’.
దీనిని జేమ్స్ ఆగస్టస్ హికి అనే విదేశీయుడు 1780 జనవరి 29న ప్రారంభించారు. ఇది ఆంగ్ల భాషలో వెలువడేది. భారత ఉపఖండంలోనే ముద్రణాయంత్రంపై ముద్రించిన తొలి వార్తా పత్రిక అది. ఈ పత్రిక ఆంగ్లేయులతో పాటు భారతీయుల ఆదరాభిమానాలు కూడా పొందింది. భారతీయులకు వార్తా పత్రికలు సొంతంగా ప్రారంభించాలనే స్ఫూర్తిని కలిగించింది.
ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్స్ పై వ్యతిరేక వార్తలు ప్రచురించారని ఆ పత్రికను మూయించారు. రెండేళ్ళ పాటు సాగిన దేశంలోని తొలి వార్తా పత్రిక బెంగాల్ గెజిట్ 1782 మార్చి 23న మూతపడింది.